ఇన్సులిన్... ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యం. ఇది తగ్గినా కష్టమే.. పెరిగినా కష్టమే. వెంటనే షుగర్ స్థాయిల్లో మార్పులు వచ్చేస్తాయి ఫలితంగా డయాబెటిక్‌గా మారిపోతారు. ఇన్సులిన్ తగ్గడం వలననే షుగర్ పెరిగిపోతుంది. ఇంతవరకూ మందుల ద్వారా దీనిని బ్యాలెన్సు చేస్తూ వచ్చారు. మరి దీనిని శరీరంలో తయారు చేయవచ్చా...? అవుననే అంటున్నారు పరిశోధకులు. వాటిని ఉత్పత్తి చేసే కొత్త ప్రక్రియను రూపొందించారట.
బెల్జియంలోని క్యాథలిక్ డి లావెయిన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అనేక చాలా ప్రయోగాల తరువాత కొత్త ప్రక్రియను రూపొందించారు. టైప్1 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో శరీర రోగనిరోధకశక్తి క్లోమగ్రంథిలోని బీటా కణాలపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేస్తుంది. దీని కారణంగా గ్లూకోజు స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది.
ఇలాంటి సమయంలో బీటా కణాల మార్పిడి చాలా అవసరం. అయితే బీటా కణాలను ఉత్పత్తి చేయటంలో విజయం సాధించారు. మానవ క్లోమగ్రంథి నాళం నుంచి సంగ్రహించిన కణాలను బీటా కణాలుగా పనిచేసేలా తీర్చిదిద్దారు. రక్తంలో గ్లూకోజు స్థాయిలను బట్టి క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా మలిచారు. దీంతో వారు అనుకున్న ఫలితాలను సాధించారు.