కండోమ్ ఉపయోగాలు ఏంటో, దాన్ని ఉపయోగించడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అరక్షిత శృంగారం గురించి ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని రకాలుగా చాటింపు వేయించినా సిగ్గు వలనో, ఎవరేమనుకుంటున్నారోననే ఆలోచన వలనో కానీ చాలామంది కండోమ్ ఉపయోగించడం, కొనడం పట్ల ఆసక్తి చూపరు.
అధికారిక గణాంకాల ప్రకారం మన దేశంలో సుమారు ఇరవై లక్షల మంది హెచ్ఐవి సోకినవారు ఉన్నారు. హెచ్ఐవి సంక్రమించకుండా ఉండేందుకు అందుబాటులోని సమర్థవంతమైన, చవకైన విధానం కండోమ్‌ను ఉపయోగించడమే. ఇప్పుడు ఆ కండోమ్‌లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ సంస్థ. ప్రపంచంలోనే తొలి ఉచిత కండోమ్ స్టోర్ ద్వారా ఇది ప్రజలకు సేవలను అందించనుంది.
ఈ సంస్థ 'లవ్ కండోమ్స్' అనే నినాదంతో భారతదేశంలోని ప్రజలకు కండోమ్‌లను అందించనున్నారు. 144 కండోమ్‌ల పెట్టెను ఉచితంగా అందుకునేందుకు అభ్యర్థనలను పంపాలని వీరు ప్రజలను కోరుతున్నారు. అవసరమైనవారు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ఇమెయిల్ పంపడం ద్వారా ఉచిత కండోమ్‌లను పొందవచ్చు అని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.