అంతర్జాతీయ మూత్ర పిండాల దినోత్సవం: మూత్రపిండాల సంబంధిత వ్యాధుల పట్ల మణిపాల్ హాస్పిటల్ అవగాహన కార్యక్రమం
గురువారం, 10 మార్చి 2022 (22:09 IST)
భారతదేశంలో పెద్ద వయస్సు వారిలో దాదాపు 10% మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 20వేలకు పైగా నూతన డయాలసిస్ కేసులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్, విజయవాడ ఓ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూత్రపిండాల సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో సాధించిన మైలురాళ్లను వెల్లడించింది.
మణిపాల్ హాస్పిటల్, విజయవాడలోని యూరాలజీ డిపార్ట్‌మెంట్ 2014లో మూత్రపిండాల మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది . ఇప్పటి వరకూ, మణిపాల్ హాస్పిటల్ 54 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను చేసింది. వీటిలో 36 జీవించి ఉన్న దాతలు నుంచి సేకరించినవి కాగా 18 మరణించిన దాతలు నుంచి సేకరించినవి. ఇవన్నీ కూడా 100% విజయవంతమయ్యాయి. ఈ అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు శస్త్రచికిత్స అనంతర సంరక్షణను కెటీఆర్‌ఆర్‌గా పిలువబడే ప్రత్యేక యూనిట్‌లో అందిస్తారు.
పూర్తి స్థాయిలో ఇన్‌ఫెక్షన్ నియంత్రణ పద్ధతుల అనుసరించడంతో పాటుగా ప్రామాణిక మార్గదర్శకాలను అనుసరిస్తూ సుశిక్షితులైన నర్సులు మరియు 24 గంటలూ నెఫ్రాలజిస్ట్‌ల సంరక్షణలో అందిస్తారు. ఈ హాస్పిటల్‌లో టాక్రోలిమస్ బ్లడ్ లెవల్స్ అంచనా సదుపాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సదుపాయాలు కలిగిన ఒకే ఒక్క హాస్పిటల్ ఇది. రాష్ట్రంలో రెండు మూత్రపిండాల మార్పిడి చేసిన మొదటి హాస్పిటల్‌గా కూడా ఇది నిలిచింది.
ఈ మైలురాయి గురించి డాక్టర్ ఎ.వి.ఎస్.ఎస్.ఎన్ శ్రీధర్-కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్-కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో, మూత్రపిండాల శస్త్రచికిత్స చేయించుకుని ఐదు సంవత్సరాలు దాటిన కొంతమందిని సైతం సత్కరించాం. వీరంతా కూడా మూత్రపిండాల శస్త్రచికిత్స తరువాత విజయవంతంగా కోలుకుని సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారు అని అన్నారు.
కన్సల్టెంట్ యూరాలజిస్ట్- కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ గంజి మాట్లాడుతూ ఈ ఆరోగ్య అవగాహన కార్యక్రమం ద్వారా నగరం, చుట్టుపక్కల గ్రామాలలో మూత్రపిండాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమం ద్వారా తమకు దగ్గరలోనే అత్యుత్తమ సంరక్షణ, సదుపాయాలు లభ్యమవుతున్నాయని తెలుసుకోగలరు అని అన్నారు.
డాక్టర్ సుధాకర్ కంటిపూడి- హాస్పిటల్ డైరెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మూత్ర పిండాల దినోత్సవ సందర్భంగా, మూత్రపిండాల సంరక్షణ కార్యక్రమంలో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ సాధించిన విజయాలు మరియు మెరుగైన చికిత్సలకు ఓ మైలురాయిగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండటం లేదా పురోగతిని నివారించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యమూ బాగుంటుంది. అందువల్ల మూత్రపిండాల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా మూత్రపిండాల స్ధితికి అనుగుణంగా మెరుగైన చికిత్సను అందిచడం కీలకం అని అన్నారు.