మానసిక వ్యాధితో బాధపడుతున్న భారత్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:00 IST)
భారతదేశం మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ మాటలంటోంది ఎవరో కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్యులు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత్‌లో సుమారు 9.5 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు డబ్ల్యుహెచ్‌వో సర్వేలో తేలింది. ప్రపంచదేశాలపై జరిపిన అధ్యయన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసింది. 
 
ఎప్పుడూ బాధపడుతుండటం, నిరాశానిస్పృహలతో ఉండటం, ఆసక్తిలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, నిద్రలేమి, సంతోషంగా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, అపరాధ భావనతో ఉండటం వంటివి ఒత్తిడి (డిప్రెషన్)కి సూచనలని చెప్పింది. ఆందోళన, భయం, ఫోబియా, పానిక్ డిజార్డర్, జనరలైజ్‌డ్ ఆంగ్జైటీ డిజార్డర్ (జీఏడీ), సోషల్ ఆంగ్జైటీ డిజార్డర్ (ఇతరులతో కలువడానికి భయపడటం), అబ్‌సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ టర్మరిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి తీవ్ర మానసిక సమస్యలుగా పేర్కొన్నది. 
 
ఈ నివేదిక ప్రకారంలో భారత్‌లో 7.5 శాతం మంది మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిపింది. చిన్నచిన్న ఇబ్బందులతో బాధపడుతున్నవారితోపాటు, తక్షణం వైద్యసేవలు అందించాల్సిన వారు సైతం ఉన్నారని చెప్పింది. 2016 అక్టోబర్‌లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్) దేశవ్యాప్తంగా ప్రజల మానసిక ఆరోగ్యంపై సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. 
 
దేశంలో 5 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేల్చింది. అంటే ప్రతి 20 మందిలో ఒకరు మానసికంగా ఆరోగ్యంగా లేనట్టు తేల్చింది. ఈ లెక్కన కేవలం ఏడాదిలోనే బాధితుల సంఖ్య దాదాపు మూడున్నరకోట్లు పెరిగిందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి