విజయవాడ : ఏ రోగం రానంత వరకే ఏదైనా... వచ్చినప్పటి నుంచి ఇక నిత్యం మాత్రలు, ఇంజక్షన్లు షరా మామూలే. ఒక్కోసారి ఈ మాత్రలు వేసుకోవాలంటే విసుగు పుడుతుంది. కొంతమంది రోగులకి ప్రతిరోజూ మాత్రలు వేసుకోవాలంటే పరమ చిరాకు. అందుకే ఒకసారి వేసుకుంటే మళ్లీ నెల రోజుల పాటు వేసుకోవాల్సిన అవసరం లేని కొత్త క్యాప్సూల్ వచ్చింది. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రైగమ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. దీనిని మిట్ స్టార్ క్యాప్సూల్ అని పిలుస్తారు. మాత్ర రూపంలోనే ఉండే ఈ క్యాప్సూల్‌ను ఒక సారి వేసుకుంటే అందులోని మందు ఏరోజుకా రోజు కావాల్సినంత మోతాదులో శరీరంలోకి విడుదల చేస్తుంది.
శరీరంలోని పరాన్న జీవుల దుష్ప్రభావాన్ని తగ్గించే ఇవెర్‌మెసిటిన్ అనే మందును ఈ కొత్త క్యాప్సూల్ ద్వారా జంతువులపై విజయవంతంగా పరీక్షించారు. సాధారణ ఆకారం, పరిమాణం ఉన్న ఈ కొత్త క్యాప్సూల్ ఒకసారి కడుపులోకి చేరగానే నక్షత్రం ఆకారంలోకి మారిపోతుంది. తద్వారా పేగుల్లోకి జారిపోకుండా ఉంటుంది. ఇలాంటి క్యాప్సూల్‌తో సాంక్రమిక వ్యాధులకు చికిత్స అందించడం మరింత సులువు అవుతుందని అంచనా. వేసుకోవాల్సిన మందులను ప్రతి రోజూ గుర్తుంచుకోవడం కష్టమయ్యే వారికి ఈ క్యాప్సూల్ ఎంతో మేలు చేస్తుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న సి.జియోవానీ ట్రావెర్సో తెలిపారు.
ఈ కొత్త క్యాప్సూల్స్ ద్వారా మందులు పని చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని అంటున్నారు. న్యూరో సైకియాట్రిక్ మందులను ఈ కొత్త క్యాప్సూళ్ల ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నామని లైండ్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆండ్రూ బెలింగర్ తెలిపారు. ఇక ఈ క్యాప్సూల్ వచ్చేస్తే, రోజు మందుల బాధ తప్పుతుందన్నమాట.