పిల్లలు తొందరగామర్చిపోతున్నారా?

గురువారం, 14 అక్టోబరు 2021 (17:18 IST)
ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం... చుట్టూ పచ్చదనం.. ఆడుకోవడానికి చాలా పెద్ద ఆరుబయలు. కానీ పరిస్థితులు మారిపోయాయి. పిల్లలకు ఆట స్థలాలు లేవు. స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వరకు ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్‌ వస్తువులు. ఇవన్నీ మూకుమ్మడిగా దాడి చేసి పిల్లల మెదడుపై ప్రభావం చూపుతున్నాయి. వాళ్ల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తున్నాయి. మరి వాళ్లలో జ్ఞాపకశక్తి పెంచాలంటే ఏం చేయాలి? ఈ కింది టిప్స్‌ చదవండి!
 
నిద్ర ప్రధానం...
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రీ-స్కూల్‌ వయసు పిల్లలయితే రోజుకు 10 నుండి 12 గంటలు, యుక్తవయస్కులయితే ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. తొమ్మిదేళ్ళ వయసులో దాదాపు 10 గంటల నిద్ర అవసరం. అంతేకాదు పిల్లలు పడుకునేందుకు సరదా సరదా కథలు చెప్తే మంచిది.

వీడియో గేమ్స్‌, టెలివిజన్‌ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను చూడనివ్వకూడదు. బెడ్‌రూమ్‌ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉండాలి. శబ్ద్దాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే లేత రంగు కర్టెన్లను ఉపయోగించాలి. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. 
 
టీవీవద్దేవద్దు...
చూసినా, చూడకపోయినా చాలా ఇళ్లలో టీవి అలా మోగుతూనే ఉంటుంది. పిల్లలు వాళ్లకి అర్ధమైనా కాకపోయినా టీవీ చూస్తుంటారు. ఇక పిల్లల కోసమే కొన్ని ఛానళ్లున్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని ఆ ఛానళ్లని పెట్టి పిల్లలను వాటి ముందు కూర్చోబెడుతుంటారు. ఈ కారణాల వలన పిల్లల మెదళ్లలోకి కొన్ని వందల రకాల శబ్దాలు చేరుతుంటాయి.

ఇలా చిన్నతనంలో లెక్కకు మించిన భిన్న శబ్దాల హౌరు వారి చెవుల్లో పడుతుంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి, తద్వారా నేర్చుకునే శక్తి తగ్గిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం టీవీ ముందు కూర్చునే పిల్లల్లో కొత్త పదాలను నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. టీవీని ఎక్కువగా చూస్తున్న పిల్లలకంటే ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తి, కొత్తపదాలను గుర్తుంచుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీవీ విషయంలో జాగ్రత్త పడండి.
ఆహారంలోనూజాగ్రత్తఅవసరం...

జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఆహారం కూడా ఎంతో ఉపకరిస్తుంది. అందులో ప్రధానమైన పాత్ర బాదంపాలది. ముఖ్యంగా పడుకునే ముందు వీటిని తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తులను అధికంగా ఇవ్వండి. మీ పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ డి శాతం అధికంగా ఉండేలా చూసుకోండి.

స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్‌, నేరేడు పండ్లను ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌- సి, ఒమెగా 3 ఫాట్స్‌ వుండే పండ్లను కూడా పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపక పెరుగుతుంది. అలాగే ఓట్స్‌, ఎరుపు బియ్యంలో విటమిన్‌ బి, గ్లూకోజ్‌ అధికంగా ఉండటంతో రోజూ పిల్లలకు ఆహారంగా ఇవ్వొచ్చు. తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక చేపల్లో ఒమెగా 3 ఫాట్స్‌ అధికంగా ఉండటం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుచేత వారానికి రెండుసార్లైనా పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపల్ని చేర్చుకోవాలి.

ఆటలతోమెదడుకుపదును...
వీడియో గేములూ, కార్టూన్లతో టీవీలకు అతుక్కుని పోయే పిల్లలకి కాస్త భిన్నమైన ఆటలు నేర్పించండి. పిల్లలకు ఇష్టమైన నాలుగైదు వస్తువులు వరుసగా పేర్చండి. కళ్లు మూసి వాటి వరుస క్రమాన్ని మార్చేసి అందులోంచి ఒక వస్తువుని మాయం చేస్తాం అన్నమాట. కళ్లు తెరిచి ఇందులో అక్కడ పేర్చిన వాటిల్లో ఏది మాయమైందో చెప్పమనాలి. ఈ ఆట వల్ల వాళ్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలా కార్లతో, రకరకాల బంతులతోనూ చేయొచ్చు. రంగులు, షేప్స్‌, ఇలా అన్నింటిని గుర్తు పెట్టుకునే విధంగా ఆటలాడించండి.

దాదాపు పదిహేను నుంచి ఇరవై రకాల వస్తువుల్ని ఓ చోట ఉంచండి. వాటిని ఐదు నిమిషాలు చూడనిచ్చి.. ఆ తరవాత తువాలు లాంటిది కప్పేయండి. ఇప్పుడు వాళ్లు చూసిన వస్తువుల్ని గుర్తుచేసుకుని వీలైనన్ని వస్తువుల పేర్లు చెప్పమనండి. దీనివల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు