తలనొప్పితో బాధపడుతున్నారా? తలస్నానం చేస్తే?

మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:25 IST)
సాధారణంగా మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. క్షణం తీరికలేని జీవనం, సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో తలనొప్పి ఒకటి.


మహిళలే తలనొప్పితో అధిక సంఖ్యలో బాధపడుతుంటారు. అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం కారణంగా వచ్చేటువంటి తలనొప్పితో ఏ పనీ సరిగా చేయలేక సతమతమవుతున్నారు.
 
తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండడంతో ఏ పని చేయాలన్నా వీలుకాదు. శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లకు చీకటి వచ్చినట్లు అనిపించడం మొదలైనవి తలనొప్పి లక్షణాలు. తలనొప్పిని పెయిన్ కిల్లర్‌తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
 
తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు ఓసారి చూద్దాం.. 
* తలస్నానం చేసిన తలను పూర్తిగా ఆరబెట్టకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. అందుకోసం డ్రైయ్యర్‌ను ఉపయోగించాల్సిన పనిలేదు. సహజంగా వీచే గాల్లో కాసేపు ఆరబెట్టినా సరిపోతుంది.
 
* డియోడ్రెంట్/పెర్ఫ్యూమ్స్ మెదడుపై ప్రభావం చూపుతాయి. పరిమళభరితమైన సుగంధాలు ఎక్కువ ఘాటుగా ఉండడం చేత తలనొప్పి వస్తుంది. కాబట్టి ఘాటు సువాసనలున్న పెర్ఫ్యూమ్ జోలికి వెళ్లకండి.
 
* ఎండలో తిరిగేటప్పుడు తలకు హ్యాట్ పెట్టుకొని తిరిగితే మంచిది. అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు ఎండలో తిరగడం వల్ల ఎక్కువ అలసటకు గురై తలనొప్పికి దారితీస్తుంది.
 
* మీరు సరిగా నిద్రపోకపోయినా అది తీవ్రమైన తలనొప్పికి దారి తీస్తుంది. కాబట్టి కనీసం 7-8 గంటల సమయం పాటు గాఢంగా నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల నిద్ర లేవగానే మీ మైండ్, శరీరం రిలాక్స్‌గా ఉండడంతో పాటు ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు.
 
* సాధారణంగా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూస్తుండడం వల్ల కళ్లకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. అప్పుడప్పుడు కళ్లకు విశ్రాంతినిస్తుండాలి. అందుకే గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. ఎక్కువ సమయం పాటు టీవీ చూడడం వల్ల కూడా కళ్లు మంటలు వస్తాయి, ఫలితంగా తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి టీవీని నిర్దిష్ట దూరం నుండి చూడాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు