చాలామంది ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుంటారు. దీనికి కారణం తాము పాటించే ఆహార నియమాలు, చేస్తున్న వ్యాయామాల కారణంగానే సడెన్‌గా బరువు తగ్గిపోతున్నామని వారు భావిస్తారు. నిజానికి ఆహార నియమాల వల్ల త్వరితగతిన బరువు తగ్గడం అంత సులభంకాదని వైద్యులు చెపుతున్నారు. కేవలం అనారోగ్య సమస్యల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు సలహా ఇస్తుంటారు. మరి అలాంటి అనారోగ్య సమస్యలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
* శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మరీ అతిగా పనిచేసినా బరువు సడెన్‌గా తగ్గుతారు. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించిన థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం, ఆందోళన, అలసట, నిద్రలేమి, చేతులు పట్టేయడం, మహిళల్లో నెలసరి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే థైరాయిడ్ అవసరానికి మించి పనిచేస్తుందని తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే బరువు మరీ అధికంగా తగ్గితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
* తీవ్రమైన మానసికఒత్తిడితో ఉండేవారు కూడా ఉన్నట్టుండి బరువు తగ్గిపోతారు. డిప్రెషన్‌తో బాధపడే వారు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు. ఏ విషయం పట్ల కూడా ఆసక్తి చూపరు. శక్తిహీనంగా అనిపిస్తారు. ఏకాగ్రత ఉండదు. నిద్రలేమి, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు, ప్రతి దానికి విసిగించుకోవడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.
* కండరాలు బలహీనంగామారితే ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతారు. అయితే కండరాలు బలహీనంగా మారేందుకు పలు కారణాలుంటాయి. ఎముకలు విరగడం, దెబ్బలు తాకడం, వయస్సు మీద పడటం, స్ట్రోక్స్, కీళ్ల నొప్పులు, నరాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల కండరాలు బలహీనంగా మారి తద్వారా బరువు తగ్గిపోతారు.
* టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా త్వరగా బరువు తగ్గిపోతారు. ఈ సమస్యతో బాధపడేవారు తరచూ మూత్రానికి వెళుతుంటారు. అలసట, దాహం అనిపించడం, కంటి చూపు మసగ్గా మారడం, అతిగా ఆకలి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలుంటే టైప్ 1 డయాబెటిస్ అని అనుమానించి వెంటనే తగు చికిత్స తీసుకోవాలి.
* ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడేవారు కూడా త్వరగా బరువు తగ్గుతారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి విరేచనాలు, కడుపు నొప్పి, గ్యాస్, మలంలో రక్తం పడడం, అలసట వంటి సమస్యలుంటాయి.
* క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారు కూడా సడెన్‌గా బరువు తగ్గుతారు. వీరిలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఛాతిలో అసౌకర్యంగా ఉండడం, దగ్గు, శ్లేష్మం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* కేన్సర్ వ్యాధి బారినపడినవారు కూడా తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువు తగ్గుతారు. వీరిలో జ్వరం, అలసట, నొప్పులు, చర్మంలో మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.