ఈ గుణత్రయ విభాగ యోగంలోని జ్ఞానమును పొందినట్లైతే భగవత్సాయుజ్యమును పొంది, సృష్టి సంహారాలకు లోనుకాదు. సాధర్మ్యము అనగా సాయుజ్యమే మోక్షమని గీత నిర్వచించింది. ఇలా 9వ అధ్యాయం చివరి శ్లోకంలోను, 18వ అధ్యాయం 65వ శ్లోకంలోను భగవానుడిలా చెప్పాడు. మన్మనాభవ మద్భ క్తోమద్యాజీ మాం నమస్కుడు, మామే వైష్యసి...నాపై మిక్కిలి ప్రీతి కలవాని మీద నాకు కూడా మిక్కిలి ప్రీతి ఉంటుంది.
రామానుజ దర్శనంలో, తన రక్షణ భారాన్ని భగవంతునిపై ఉంచిన ప్రపన్నుని సర్వ పాపాలను పరిహరించి పరమాత్మ తన స్థానమైన వైకుంఠమున చేర్చుకొను విధానము, 'సంత్సంగాత్ భవ నిస్పృహా గురు ముఖాత్, ముక్త్కోర్చర్ధిన పూర్వపక్ష...' అనే రెండు శ్లోకాల్లో విరింపబడింది.
సత్సంగం వల్ల సంసారములో వివక్తుడై సదాచార్య సమాశ్రయణం చేసి, వారి మంత్రోపదేశానుసారం శ్రియః పతిని శరణాగతి చేసి, ఆగామి కర్మ తామరాకుపైన నీటిబొట్టులా అంటకుండా చేసికొని, నిప్పులో పడిన దూదివలె సంచిత కర్మను భస్మం చేసి, ప్రారబ్ద శేషమును అనుభవించి, తన ఉపాసనా అతిశయముచే ప్రసన్నుడైన పరమాత్మ ప్రకృతి బంధాన్ని నిశ్శేషం చేయగా, సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని వెలుపలికి వచ్చి అర్చిరాది మార్గంలో పయనించి పరమపదం చేరగలడు. ఈ పద్ధతి అంతా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము 24 నుంచి 27వ శ్లోకం వరకు సంగ్రహంగా సూచించబడింది. అదే ముక్తి ఫల స్వరూపం.