చుండ్రు ఎందుకు వస్తుంది... పరిష్కార మార్గాలివిగో....

బుధవారం, 13 జులై 2016 (11:52 IST)
ప్రపంచ జనాభాలో 90 శాతం మందిని చుండ్రు సమస్య వేధిస్తుంది. తల దువ్వుకునేటపుడు పొట్టులా రాలేదే చుండ్రు. దీనివల్ల తలలో విపరీతమైన దురద పుడుతుంది. ఈ చుండ్రు అనేది ఆడ, మగ భేదం లేకుండా బాధించే సమస్యల్లో ఒకటి. కాకపోతే ఎక్కువ శాతం ఈ చుండ్రుతో బాధపడేవారి సంఖ్య పురుషుల కన్నా స్త్రీలలోనే ఉంటుంది. అసలు చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే కారణాలు అనేకం. అయితే, చుండ్రు రావడానికి, చుండ్రు సమస్య నివారణకు గల పరిష్కారాలను తెలుసుకుందాం. 
 
సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌ వంటిది. అయితే చాలా మంది చుండ్రు నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. దీన్ని తొలగించడానికి పార్లర్లకు వెళ్ళి చికిత్స తీసుకోనవసరం లేదు. ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే, దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసంలో రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలపాలి. దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే కొంతమేరకు చుండ్రు సమస్య మటుమాయమైపోతుంది. అరకప్పు పెరుగులో రెండు టేబుల్‌ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరగంటాగి కడిగేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తున్నట్టయితే ఫలితం ఉంటుంది. 
 
మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టి, ఆ గింజలను పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుతో తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకుని, ఓ అర్థగంట తర్వాత షవర్‌ బాత్‌ చేస్తే చుండ్రు పోతుంది. ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం కలిపి తలస్నానం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కోవాలి. దీనివల్ల చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గిపోవడమే కాకుండా జుట్టుకు మెరుపు చేకూరుతుంది. 

వెబ్దునియా పై చదవండి