ఆ పాట వింటూనే వళ్ళు పులకరిస్తుందిః పీబీ శ్రీనివాస్

WD PhotoWD
14 భాషల్లో గొంతు విప్పి లక్షలాది మంది శ్రోతల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారాయాన... ఏ భాషలోనైనా అవలీలగా స్థానిక గాయకులను మైమరిపిస్తారు. గజల్స్‌ను పాడడంలోనూ తనకంటూ ప్రత్యేక చోటే దక్కించుకున్నారు. తండ్రి వారిస్తున్నా వినకుండా గానమే తన ఊపిరిగా జీవితాన్ని రూపుదిద్దుకున్న దిట్ట ప్రతివాది భయంకర శ్రీనివాస్. సుశీల, జానకీ, జమునా రాణి.... ఇలా చాలా మంది గాయనీమణుల సరసన మధురమైన పాటలను వినిపించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. దాని సారాంశమే ఇది..

? దేశభక్తి గేయాల్లో మీకు నచ్చిన మంచి గేయం
! దేశభక్తి గేయాల విషయానికొస్తే నచ్చినవి చాలా ఉన్నాయి. వాటిలో నన్ను బాగా ప్రభావితం చేసింది. సినిమా పాట కాదు. ప్రైవేటు గేయం. దాన్ని ఘంటశాల ఆలపించారు. స్వాతంత్రమే నా జన్మహక్కని చాటి చెప్పరా.... అని ఆయన గళం విప్పి పాడుతుంటే నా వళ్ళు పులకరించి పోయింది. నన్ను చాలా ప్రభావితం చేసింది. ఘంటశాలగారి శ్రావ్యమైన గొంతు శ్రోతలను మరింత ఉత్తేజ పరుస్తుంది.

? దేశభక్తి గేయాల్లో మీరు ఆలపించి మీకు నచ్చిన దేశభక్తి గేయం
! దేశభక్తి గేయాలు నేను పాడినవి పెద్దగా లేవు. కాని చాలా గేయాలే రాశాను. దాదాపు 2 లక్షలకు పైగా రచనలు చేశాను. వీటిలో దేశభక్తి గేయాలు కూడా ఉన్నాయి.

? ప్రస్తుతం సినిమాల్లో దేశభక్తి గేయాలకున్నఉన్న చోటుపై మీ అభిప్రాయం
! కాలానుగుణంగా మార్పుల చాలానే వస్తున్నాయి. అలాగే సినిమాల్లో వాటి సంఖ్య తగ్గుతోంది. అందులో అనుమానం లేదు. అది ఒక్కటే కాదు. సంగీతంలో కూడా మార్పు వచ్చింది. ఇదంతా కాలంతోపాటు వస్తున్న మార్పులే. ఉదాహరణకి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను'. అనే పాటను కర్ణాటక సంగీత తీరులో పాడితే వినే వారు ఎంత మంది ఉన్నారు. అందుకే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా వస్తాయి.

? వీటిని మీరు సమర్థిస్తారా
! నేను దేనిని సమర్థించను. కాని కాలనుగుణంగా వస్తున్న మార్పులను అడ్డుకోలేం. అది సహజం. ఒకప్పుడు వయోలెన్‌(శ్రావ్యం)గా సినిమాలు ఉండేవి. మరి ఇప్పుడు వయెలెన్స్(హింస ఎక్కవ)గా మారిపోయాయి. హీరోలకున్న ప్రాధాన్యత తగ్గింది. విలన్లకు ప్రాధాన్యత పెరిగింది. ఏం జనం సినిమాలు చూడడం లేదా. ఇదంతా కాలానుగుణంగా జరుగుతున్న పరిణామమే. దానికి మనమేమి చేయగలం.

? ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా... అనే పాట సూపర్ హిట్ అయినప్పుడు మీ అనుభూతి
! భలే చెపుతారండీ.. పాట హిట్టయితే ఏ గాయకుడికి ఆనందంగా ఉండదు చెప్పండి. ఇందులోంచే మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను. నేను అప్పట్లో హైదరాబాద్ తొలిసారి వెళ్ళాను. ఏ ఇంటికి వెళ్ళినా అదే పాటే. వినిపిస్తోంది. ఆశ్చర్య పోయాను. కళకు రసజ్ఞతే వెల. రసజ్ఞతకు మించి కళ మరోటి లేదు. ఇప్పటికే అర్థమయిందనుకుంటాను. జనంలోకి అది అంతగా చొచ్చుకు పోయింది. దేవుడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నారు.

? కన్నడలో రాజ్‌కుమార్‌తో పోటీ పడుతూ పాటలు పాడారు కదా ! మీ ఫీలింగ్
! ఆయనతో పోటీ ఏమిటీ... ఆయన చాలా గొప్ప గాయకుడు.. మాధురమైన శ్రావ్యం కలిగిన గాయకుడు. ఆయన నాకు చాలా అవకాశాలిచ్చాడు. ఒక్కొక్కమారు నేను పాడిన పాటలు తాను పాడినట్లు పొరబడేవారు. ఆయనపాడిన పాటలను నేను పాడినట్లు పొరబడే వాడిని. అంటే మా గొంతుల మధ్య అంతటి సారూప్యత ఉంది.
దేశభక్తి..
  దేశభక్తి గేయాలు నేను పెద్దగా పాడలేదు. చెప్పుకోదగ్గవి ఏమి లేవు. కాని ఘంటశాల పాడిన సాతంత్ర్యమే నా జన్మహక్కని చాటరా.... అనే పాట వినగానే వళ్ళు పులకరిస్తుంది. మనసు తేలికవుతుంది. చాలా మధురగానం.. అది నేన్నటికీ మరులేను.      
ఆయనతో నాకు పోటీలేదు. సాన్నిహిత్యం ఉంది.

? దాదాపు 14 భాషల్లో పాడారు మరి ఎక్కడా ఇబ్బంది పడలేదా..! ఇదేలా సాధ్యం
అంతా ప్రాక్టీస్‌పైనే సాధ్యం

? అంత సులభమా...
చాలా మంచి సందేహం వ్యక్తపరిచారు. అంత సాధ్యం కాదు. ఒక భాష గాయకుడుగా ఉంటూ మరో భాషలో పాడడం అంతసులువేమి కాదు. తేడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దానిని ముందుగా తెలుగులో రాసుకునే వాణ్ణి. మొదట్లో లిరిక్ రైటర్‌ను పక్కన కూర్చుబెట్టుకుని పాడేవాడిని. ఇది ఎన్నో రోజులు పని చేయలేదు. భాష నేర్చుకోవడానికి చాలానే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే వ్యాకరణం నేర్చుకోవడం, నిఘంటువు వినియోగం చాలా ఉపయోగ పడ్డాయి. అవే నా బలంగా నిలిచాయి.

? గజల్స్ విషయంపై...
! గజల్స్‌కూ, పాటలకూ చాలా తేడా ఉంటుంది. నేను గజల్స్ పాడుతుంటే జెమినీ గణేషన్ చెక్కబల్లపై దరువేసే వారు. అంటే అంతగా పులకించిపోయేవారు. ఒక్కమారు గజల్ పాడడానికి ముంబయి వెళ్లాను. మొదట్లో అక్కడి సంగీత కారుడు నాకు నేరుగానే వద్దని చెప్పారు. అప్పటికే అక్కడ చాలా మంది విఫలమై వచ్చారు. నేను పడిన తరువాత ఆయనే నేరుగా వచ్చి అభినందించారు. ఉర్దూలో నాకు నచ్చన గజల్ 'యారో ముజే మాఫ్‌కరో' అనే గజల్‌ను రెండు రకాలుగా పాడవచ్చు. ఇది కాకుండా యారో 'ముజే మాఫ్‌రకో'అని కూడా పాడవచ్చు. నేను 'రకో' అనే పాడుతాను. అర్థం చాలా తేడా ఉంటుంది. గజల్స్‌లో చాలా అర్థాలు దాగి ఉంటాయి. చాలా గజల్స్ రాశాను కూడా.

? కళాకారుడిగా తీరని కోరిక ఏమైనా ఉందా
! ప్రత్యేకంగా ఏమీలేదు. కాకపోతే దాదాపు 2 లక్షలకుపైగా రచనలు, గేయాలున్నాయి. వాటిలో కొన్నింటికి ప్రాచుర్యంలోకి తేలేక పోయాను. తీసుకు రావాలని కోరిక ఉంది.

? సంతృప్తినిచ్చిన సంఘటన, సందర్భం..
! మెడిటేషన్... మెడిటేషన్.. అని చెప్పడం కాదు. దానిని పాటించాలి. అది నేను చేశాను. ఒక్కమారు ద్యానంలో లీనమై నా కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. ఏడుస్తున్నానని నా తల్లి తట్టుకోలేక పోయింది. తనను ఎవరో కొడుతున్నారని వారిని శాపనార్థాలు పెట్టింది. ద్యానంలోంచి బయటకు రాగానే ఎవరు కొట్టారని అడిగారు. కాదని అవి దేవుడిని చూసిన అని చెప్పాను. నిన్ను కన్న నా జన్మ ధన్యమైందన్నారు. ఇంతకంటే భాగ్యం ఏమి కావాలి.

? నవీన గాయకులకు మీరిచ్చే సందేశం
! సందేశం ఇచ్చే అంతటి గొప్పవాణ్ణి కాను. కాకపోతే వృత్తిని దైవంగా భావించాలి. ఏకాగ్రత చాలా ఉండాలి. మెళుకువలు నేర్చుకోవాలి.

వెబ్దునియా పై చదవండి