టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని శిల్పా శిరోద్కర్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ఆమె.. తనకు కరోనా వైరస్ సోకినట్టు వెల్లడిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు.
కాగా, గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా, సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింగపూర్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
అలాగే, హాంకాంగ్‌లోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారినపడ్డారు.