అమెరికాలో కటకటాలపాలైన భారతీయులు

మాదకద్రవ్యాల అక్రమ రవాణ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులను కాలిఫోర్నియా కోర్టు దోషులుగా ప్రకటించింది. ఈ ముగ్గురు వ్యక్తులు కెనడాలోని టోరంటో ఆసియా ముఠా సభ్యులకు కొకైన్‌ సరఫరా చేసేవారని అక్కడి పోలీసులు తెలిపారు.

కెనడాకు చెందిన హర్‌జీత్‌ మాన్‌(50) ఈ ముఠా మాదకద్రవ్యాల సరఫరా చేసే బృందానికి నాయకుడని, మాదకద్రవ్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. ఇతను అధిక మొత్తంలో మాదకద్రవ్యాలను ట్రాక్టర్‌ ట్రెయిలర్స్‌ ద్వారా కెనడాకు పంపేవాడని పోలీసులు వివరించారు.

కెనడాలో ఆసియా ముఠాకు సుఖ్‌రాజ్‌ దలీవాల్‌(39), గురుమీత్‌ బిస్లా (29)లు మాదక ద్రవ్యాలు, పదార్థాలను సరఫరా చేసేవారు. హర్‌జీత్‌మాన్‌, దలీవాల్‌ వద్ద 70 కిలోగ్రాముల కొకైన్‌ లభ్యమయిందని పోలీసులు తెలిపారు.

వీటి విలువ సూమారు 843,000 డాలర్లని అదే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 4 కోట్ల 20 లక్షలుగా ఉంటుందని తాము అంచనా వేశామని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుండగా అతని వద్ద లభించిన 1,011,068 డాలర్లు, అతని బ్యాంకులో ఉన్న 52,669 డాలర్లును స్వాధీనం చేసుకోమని మాదకద్రవ్య నియంత్రణ శాఖాధికారులను అక్కడి కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి