అమెరికాలో శిశువును చంపిన ఎలుకలు

అమెరికాలో ఎలుకలు శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా లూసియానాలో ఓ శిశువు ఎలుకల దాడిలో మృతి చెందింది. ఒహియో రాష్ట్రంలోనూ ఎలుకల దాడిలో మరో శిశువుకు రెండు కాలివేళ్లు పోయాయి. ఒహియో శిశువు సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ముగ్గురు వ్యక్తులపై అధికారిక యంత్రాంగం కేసులు నమోదు చేసింది.

శిశువుకు ఎలుకల నుంచి ప్రమాదం పొంచివున్న విషయాన్ని గమనించనందుకు అధికారిక యంత్రాంగం వీరిపై చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే ఎలుకల దాడిలో గతవారం మృతి చెందిన లూసియనా శిశువు కేసుకు సంబంధించి అధికారిక యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఎలుకలు దాడి చేసిన సమయంలో తాము ఇంటిలోలేమని శిశువు తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు.

దాడి జరిగిన సమయంలో తమ మూడు నెలల ఆడ శిశువు నిద్రిస్తుందని తెలిపారు. పిల్లలను వీరు చాలా జాగ్రత్తగా చూసుకునే వారని ఇరుగుపొరుగువారు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల ఎలుకలను పట్టుకునేందుకు శిశువు తండ్రి బోనులు కూడా ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి