ఇరాక్‌లో అమెరికా దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రిస్టోఫర్ హిల్‌ను లక్ష్యంగా చేసుకొని ఆదివారం బాంబు దాడి జరిగింది. ఇరాక్ దక్షిణ ప్రాంతంలో క్రిస్టోఫర్ హిల్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు రోడ్డుపక్కన అమర్చిన బాంబును పేల్చారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి హాని జరగలేదు.
బాంబు దాడి నుంచి క్రిస్టోఫర్ సురక్షితంగా బయటపడ్డారని అమెరికాకు చెందిన ఓ వార్తాపత్రిక సోమవారం వెల్లడించింది. బాగ్దాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిరియా వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో క్రిస్టోఫర్తోపాటు ఎవరూ గాయపడలేదు. తన కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయాన్ని క్రిస్టోఫర్ విలేకరులతో చెప్పారు.
అమెరికా దౌత్యకార్యాలయం దీనిపై స్పందించలేదు. ఇరాక్‌లో గత 18 నెలల కాలంలో తీవ్రవాద దాడులు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే తీవ్రవాదులు ఇప్పటికీ దాడులు చేయగలుగుతున్నారు. గత నెలాఖరులో ఇరాక్ ప్రధాన నగరాల శాంతి, భద్రతల బాధ్యతలను అమెరికా సైన్యం స్వదేశీ భద్రతా సిబ్బందికి అప్పగించింది.