అమెరికా రిపబ్లికన్ పార్టీ భావి అధ్యక్ష అభ్యర్థిగా గుర్తింపు పొందిన దక్షిణ కరోలినా రాష్ట్ర గవర్నర్ మార్క్ స్టాన్ఫోర్డ్ ఓ అర్జెంటీనా మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఆ మహిళ కూడా ధృవీకరించారు. అర్జెంటీనా మహిళతో సాన్నిహిత్యాన్ని స్టాన్ఫోర్డ్ ఇప్పటికే ధృవీకరించి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా స్టాన్ఫోర్డ్తో తన సాన్నిహిత్యం నిజమేనని అర్జెంటీనాకు చెందిన మాజీ రిపోర్టర్ మరియా బెలెన్ చాపూర్ (41) ధృవీకరించారు.
స్టాన్ఫోర్డ్తో తన అనుబంధం గురించి ఎక్కువ వివరాలు వెల్లడించేదుకు బెలెన్ నిరాకరించారు. అమెరికా, అర్జెంటీనా దేశాల్లో స్టాన్ఫోర్డ్- బెలెన్ సాన్నిహిత్యం గత కొన్నిరోజులుగా సంచలనం సృష్టిస్తోంది. ఇ- మెయిల్ సందేశాలు బహిర్గతం కావడంతో వీరి ఎఫైర్ మీడియాలో పతాక శీర్షికలకెక్కింది.
తాజాగా స్టాన్ఫోర్డ్తో అనుబంధం నిజమేనని చెప్పిన బెలెన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడాలనుకోవడం లేదని బ్యూనస్ ఎయిర్స్కు చెందిన సీ5ఎన్ అనే వార్తా నెట్వర్క్తో చెప్పారు. అమెరికా, అర్జెంటీనా మీడియా మాత్రం వీరిద్దరి అనుబంధాన్ని లోతుల్లోకి వెళ్లిమరీ విశ్లేషించడం మొదలుపెట్టింది.
మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను ఎంతగానే భాదించిందని, తన కుటుంబం మొత్తం దీని వలన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందని బెలెన్ చెప్పారు. గత ఏడాది తన ఇ- మెయిల్ అకౌంట్లోకి అనుమతి లేకుండా ఎవరో అజ్ఞాత వ్యక్తి చొరబడ్డారు. తన ఇ- మెయిల్లోని సందేశాలను బహిర్గతం చేశారు.
స్టాన్ఫోర్డ్ తన మధ్య అనుబంధాన్ని వివరించే ఈ సందేశాలను దక్షిణ కరొలినాకు చెందిన ది స్టేట్ పత్రిక ప్రచురించింది. స్టాన్ఫోర్డ్- బెలెన్ అనుబంధంపై అనంతరం మీడియా మొత్తం దృష్టి కేంద్రీకరించింది. ఇ- మెయిల్లోకి చొరబడిన హ్యాకర్ తన స్నేహితుడేనని వచ్చిన వార్తలను బెలెన్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు.