ఇరాన్‌లో బ్రిటన్ దౌత్యవేత్తల బహిష్కరణ

దేశంలో రహస్య అక్రమ కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని, గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇరాన్ ప్రభుత్వం ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే నెజాద్ పెద్దఎత్తున రిగ్గింగ్ చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించారని ఆయన ఎన్నికల ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం ఆధ్వర్యంలో ఇరాన్‌లో గత పది రోజులుగా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. దేశంలో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నప్పటికీ, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలనే ప్రతిపక్ష డిమాండ్‌ను ఇరాన్ ప్రభుత్వం మంగళవారం తోసిపుచ్చింది.

ఇరాన్‌లో మళ్లీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ మద్దతుదారులు మంగళవారం టెహ్రాన్‌లోని బ్రిటన్ దౌత్యకార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయేల్ జాతీయ జెండాలను తగలబెట్టారు. దౌత్యకార్యాలయంపై టమేటాలో విసిరారు. అమెరికా, బ్రిటన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో సుమారు 100 మంది ఇరాన్ పౌరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అంతకుముందు ఇరాన్ ప్రభుత్వం ఇద్దరు బ్రిటన్ దౌత్యాధికారులను గూఢచర్యం ఆరోపణలపై దేశం నుంచి బహిష్కరించింది. దీనికి ప్రతిగా బ్రిటన్ కూడా ఇద్దరు ఇరాన్ దౌత్యాధికారులను వెనక్కుపంపాలని నిర్ణయించుకుంది.

ఇరాన్‌లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. మానవ హక్కులను గౌరవించాలని బ్రిటన్ ప్రభుత్వం ఇరాన్‌కు సూచించడం వివాదాస్పదమైంది. అనంతరం ఇరాన్ ప్రభుత్వ పెద్దలు కూడా బ్రిటన్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. తమ దేశంలో హింసాకాండను పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి