ఇరాన్: బ్రిటన్ ఎంబసీ ఉద్యోగికి బెయిల్

ఇరాన్‌లోని బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగి బెయిల్‌పై విడుదలయ్యారు. గత నెలలో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం జరిగిన పెద్దఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలపై బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులను ఇరాన్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆందోళనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న బ్రిటన్ దౌత్యకార్యాలయ ఉద్యోగుల్లో ఎనిమిది మంది ఇప్పటికీ విడుదలకాగా, మిగిలిన ఒక్క ఉద్యోగి కూడా ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. బ్రిటన్ దౌత్యకార్యాలయంలో ప్రధాన రాజకీయ విశ్లేషకుడిగా పనిచేస్తున్న హుస్సేన్ రాసం ఆదివారం టెహ్రాన్‌లోని ఎవిన్ జైలు నుంచి విడుదలయ్యారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.

ఆయనకు లక్ష డాలర్ల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరైంది. దేశ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలపై రాసంను జూన్ 27న ఇరాన్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. జూన్‌లో ఇరాన్ బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న తొమ్మిది మంది స్థానిక ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. మిగిలినవారందరూ ఇప్పటికే విడుదలకాగా, రాసం ఒక్కరినే ఇప్పటివరకు జైలులో ఉంచారు.

వెబ్దునియా పై చదవండి