ఇస్లామాబాద్‌లో 25 మంది తీవ్రవాదుల అరెస్ట్

పాకిస్థాన్ పోలీసులు 25 మంది ముఖ్య తీవ్రవాదులను అరెస్టు చేశారు. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో దాడుల కోసం వ్యూహరచన చేస్తున్న వీరిని ఇస్లామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అనుమానిత తీవ్రవాదుల్లో ఆత్మాహుతి దళ సభ్యుల శిక్షకులు, వారికి సాయం చేసేవారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. తాజాగా అరెస్టు చేసినవారందరూ ముఖ్యమైన తీవ్రవాదులేనని ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయద్ కలీమ్ ఇమామ్ చెప్పారు. కరాచీ, లాహోర్ నగరాల్లో తీవ్రవాద దాడులకు జరిగిన కుట్రను తాజా అరెస్టులతో భగ్నం చేశామన్నారు.

దేశంలోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ చేపట్టినప్పటి నుంచి లాహోర్, పెషావర్ నగరాలతోసహా అనేక నగరాల్లో ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. వీటిలో అనేక దాడులకు బైతుల్లా మోహసూద్ నేతృత్వంలోని తెహ్రీన్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించింది.

వెబ్దునియా పై చదవండి