దక్షిణ కొరియాకు చెందిన నౌకను ఒకదానిని ఉత్తర కొరియా ఆధీనంలోకి తీసుకుంది. తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన కారణంగా ఉత్తర కొరియా చేపలు పట్టే బోటును, అందులోని నలుగురు సిబ్బందిని నిర్బంధించింది. అనుకోకుండా ఈ నౌక దేశ తీర్పు జల సరిహద్దును అతిక్రమించిందని దక్షిణ కొరియా అధికారిక యంత్రాంగం తెలిపింది.
దీనిని సాధ్యమైనంత త్వరగా విడిచిపెట్టాలని కోరింది. గురువారం దక్షిణ కొరియా అధికారిక యంత్రాంగం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షల కారణంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ బోటు ఇరుదేశాల మధ్య జల సరిహద్దును ఉల్లంఘించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమ దేశానికి చెందిన సిబ్బందిని, బోటును విడిచిపెట్టాలని దక్షణ కొరియా అధికారికంగా ఉత్తర కొరియా మారిటైమ్ యంత్రాంగానికి లేఖ రాసింది. ఉత్తర కొరియా కూడా ఈ లేఖ తమకు అందిందని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఫోన్ ద్వారా దక్షిణ కొరియా అధికారులకు తెలియజేసింది.