ఐఏఈఏ కొత్త అధిపతిగా జపాన్ పౌరుడు

జపాన్‌కు చెందిన యూకియా అమనో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) కొత్త అధిపతిగా ఎన్నికయ్యారు. జపాన్‌పై అణు బాంబుల ప్రయోగాన్ని, వాటి విధ్వంసాన్ని స్వయంగా వీక్షించిన యూకియా అమనో అణ్వాయుధాల వ్యాధి నిరోధానికి ఎంతో కృషి చేశారు. తాజాగా ఆయనను ఐఏఈఏలోని 35 సభ్యదేశాలు కొత్త అధిపతిగా ఎన్నుకున్నాయి.

ఐఏఈఏ ప్రస్తుత అధిపతి మొహమెద్ ఎల్‌బరాదీ పదవీ విరమణ తరువాత యూకియా ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్‌బరాదీ 12 ఏళ్లపాటు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ చీఫ్‌గా వ్యవహరించారు. అణ్వాస్త్రవ్యాప్తిని నిరోధించే దిశగా ఎల్‌బరాదీ చేసిన కృషికి ఆయనను నోబెల్ శాంతి బహుమతి కూడా వరించింది.

ఎల్‌బరాదీ నేతృత్వంలో చేపట్టిన చర్యల ఫలితంగా ఉత్తర కొరియా ఒక దశలో అణ్వస్త్ర కార్యక్రమాన్ని విడిచిపెట్టింది. అనంతరం ఎల్‌బరాదీ అధికారిక యంత్రాంగం అనేక దేశాల్లో అనుమానిత అణు కార్యక్రమాలపై దర్యాప్తు జరిపింది. అయితే ఈ దర్యాప్తులు అసంపూర్తిగానే మిగిలివున్నాయి.

తాజాగా ఎల్‌బరాదీ స్థానంలో యూకియాను నియమించే ప్రతిపాదనకు ఐఏఈఏలోని పారిశ్రామిక దేశాలు మద్దతు ఇచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం ఆయన ప్రత్యర్థి అబ్దుల్ సమద్ మింటీ (దక్షిణాఫ్రికా)ని సమర్థించాయి.

యూకియా ఐఏఈఏలో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తుండగా, అబ్దుల్ సమద్ మింటీ మాత్రం అమరికా, ఇతర అణ్వాయుధ దేశాలను నిరాయుధీకరణపై సవాలు చేయాలనుకున్నారు. చివరకు పారిశ్రామిక దేశాలు మద్దతిచ్చిన అభ్యర్థికే ఐఏఈఏ చీఫ్ బాధ్యతలు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి