రష్యా మాఫియా సామ్రాజ్యంలోని ప్రధాన వ్యక్తుల్లో ఒకరు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాచెస్లావ్ ఇవాన్‌కోవ్ అనే మాఫియా ముఠా నేతపై కాల్పులు జరిపి గాయపరిచారు. వారి కాల్పుల్లో వ్యాచెస్లావ్‌కు ఉదర భాగంలో గాయమైంది.
మాస్కో వాయువ్య ప్రాంతంలో ఉన్న థాయ్ ఎలిఫెంట్ రెస్టారెంట్ నుంచి అతను మంగళవారం సాయంత్రం బయటకు వస్తున్న సమయంలో దాడి జరిగింది. ఈ దాడిపై రష్యా అధికారిక యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్పుల గాయాలతో మాఫియా నేత వ్యాచెస్లావ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రష్యా మీడియా వెల్లడించింది. వ్యాచెస్లావ్ ఇవాన్‌కోవ్ (69) యాపాన్‌చిక్ (లిటిల్ జపనీస్) అనే పేరుతో రష్యా అండర్‌వరల్డ్‌లో ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. జపాన్ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు కావడం, పొట్టిగా ఉండటం వలన అతనికి లిటిల్ జపనీస్ అనే పేరు స్థిరపడింది.
దొంగతనాలు, దోపిడీలు, ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలతో 1960వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్‌లో మాఫియా కెరీర్ ప్రారంభించిన యాపోన్‌చిక్ 1991 వరకు సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపాడు.
1992లో రష్యా నుంచి పరారై అమెరికా చేరుకున్నాడు. న్యూయార్క్‌లోని బ్రూక్లైన్‌లో ఉన్న బ్రింగ్టన్ బీచ్‌లో రష్యన్లపై ఆధిపత్యం చెలాయించి అమెరికాలోనూ 9 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. 2004లో విడుదలైన అతడిని అమెరికా ప్రభుత్వం రష్యాకు పంపివేసింది.