చైనాలో పది వేల మంది ఉయ్‌గుర్ వర్గీయులు అదృశ్యమయ్యారని ప్రవాసంలో ఉన్న వారి నేత రెబియా కదీర్ బుధవారం పేర్కొన్నారు. ఒకే రాత్రిలో వీరందరూ కనిపించకుండా పోయారని ఆమె ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో చైనాలో ఉరుంఖీ నగరంలో జాతి ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున హింసాకాండకు దారితీశాయి.
ఈ సందర్భంగా ఒకే రోజు రాత్రి పది వేల మంది తమ వర్గీయులు కనిపించకుండా పోయారని 62 ఏళ్ల కదీర్ తెలిపారు. వీరందరూ ఆచూకీ తెలియకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అమెరికాకు చెందిన ప్రపంచ ఉయ్‌గుర్ కాంగ్రెస్‌కు అధిపతిగా ఉన్న కదీర్ చైనా ప్రభుత్వంపై నేరుగా నిప్పులు చెరిగారు.
ఉయ్‌గుర్ ప్రజలను నాశనం చేసేందుకు చైనా ప్రయత్నిస్తుందన్నారు. తమ పరిస్థితుల గురించి అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం కదీర్‌ను నేరస్థురాలిగా పరిగణిస్తోంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో హాన్ చైనీస్ వర్గంపైకి ఉయ్‌గుర్‌లను ఆమె రెచ్చగొట్టారని, ఈ కారణంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు 197 మంది పౌరుల మరణానికి కారణమైందని చైనా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
మరోవైపు జపాన్‌లో ఉంటున్న కదీర్ కూడా ఈ హింసాకాండకు చైనా ప్రభుత్వమే కారణమంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు. తమ శాంతియుత నిరసన ప్రదర్శనను హింసాత్మక అల్లర్లుగా అధికారిక యంత్రాంగమే మార్చిందని ఆరోపించారు. టోక్యోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉయ్‌గుర్‌లకు ప్రదర్శనల్లో పాల్గొనడమంటే ఆత్మహత్యలతో సమానమన్నారు.