నాటో- రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణ

నాటోతో రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి రష్యా, నాటో విదేశాంగ మంత్రులు శనివారం సమావేశం కానున్నారు. దక్షిణ ఒసెటియా విషయంలో గత ఏడాది జార్జియా, రష్యా మధ్య జరిగిన పోరు అనంతరం నాటో, రష్యాలు సమావేశమవుతుండటం ఇదే తొలిసారి.

జార్జియాతో యుద్ధం కారణంగా నాటో- రష్యా మిలిటరీ సంబంధాలు తెగిపోయాయి. అయితే గత ఐదు నెలలుగా నాటో కూటమి, రష్యా మధ్య రాజకీయ సంబంధాలు మాత్రం బాగా మెరుగుపడ్డాయి. అయినప్పటికీ మిలిటరీ సంబంధాల విషయంలో మాత్రం యుద్ధం తరువాత అధికారికంగా ఎటువంటి సంప్రదింపులు జరగలేదు.

వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్‌తో సమావేశమవుతున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను ఈ సమావేశం మెరుగుపరుస్తుందని రష్యా అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శనివారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, నాటో కూటమిలోని 28 దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా నాటో- రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక నిర్ణయం వెలువడనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి