కాశ్మీర్ వివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈజిప్టులో జరుగుతున్న అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సును వేదికగా చేసుకుంది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు కాశ్మీర్ వివాదానికి పరిష్కారం ముఖ్యమని పాకిస్థాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. భారత్తో ఈ వివాదం పరిష్కారం దిశగా ముందడుగు కూడా పడిందని పేర్కొంది.
దక్షిణాసియా ప్రాంతంలో శాశ్విత శాంతి స్థాపన సాధ్యమేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. జమ్ము- కాశ్మీర్తోసహా ఈ ప్రాంతంలో నెలకొనివున్న సుదీర్ఘ వివాదాలను పరిష్కరించడం ద్వారా శాంతి స్థాపన సాధ్యపడుతుందని గిలానీ అభిప్రాయపడ్డారు.
భారత్- పాక్ సంబంధాలను ఇటీవల కొంత ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 1.5 బిలియన్ల మంది ప్రజలకు శాంతిని అందించడం, వారికి ఎంతో విలువైన కానుక అవుతుందన్నారు.