పాకిస్థాన్‌కు పౌర సాయాన్ని భారీగా పెంచే కెర్రీ- లూగర్ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ద్వారా పాకిస్థాన్‌కు అమెరికా ప్రభుత్వం అందజేసే పౌర సాయాన్ని మూడురెట్లు పెంచనున్నారు. వచ్చే ఐదేళ్లకాలంలో అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు 7.5 బిలియన్ డాలర్ల పౌర సాయాన్ని అందజేయనుంది.
ఇదేవిధంగా వచ్చే పదేళ్ల కాలంలో పాకిస్థాన్‌కు 15 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఈ బిల్లులో అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. కెర్రీ- లూగర్ బిల్లుకు సెనెట్‌లో ఇరుపార్టీల (రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) మద్దతు లభించింది. ఇదిలా ఉంటే అంతకుముందు ప్రతినిధుల సభ జూన్ 11న పాక్ ఆర్థిక సాయానికి సంబంధించి ఆమోదించిన బిల్లులో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి.
ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన బిల్లు పాకిస్థాన్‌కు ఆర్థిక సాయాన్ని తీవ్రవాదంపై పోరుతో ముడిపెట్టాలని సూచిస్తోంది. ఈ కఠిన నిబంధనలు పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రవాదంపై జరుపుతున్న పోరుకు ఆటంకం కలిగిస్తాయని బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేసింది.