పాక్‌లో కాల్పులు: ఐరాస అధికారి హత్య

పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కొందరు గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఇతరులు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ కార్యాలయంలోకి చొరబడిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

పెషావర్‌లోని కచా గార్హి శరణార్థ శిబిరంలో ఐరాస కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ అధికారి మృతి చెందగా, సెక్యూరిటీ గార్డుతోపాటు ఇద్దరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే సాయుధులు ఐరాస అధికారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని ఆయన ప్రతిఘటించడంతోపాటు వారు కాల్చిచంపారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాజౌర్ గిరిజన ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ చేపట్టిన తరువాత ప్రాణభయంతో తరలివచ్చిన ఆ ప్రాంత పౌరులు కచా గార్హి క్యాంపులో తలదాచుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి