భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో సమావేశమయ్యారు. ముంబయి ఉగ్రవాద దాడుల దర్యాప్తులో పాకిస్థాన్ సాధించిన పురోగతిని ఈ సందర్భంగా సమీక్షిస్తారు. ముంబయి దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తమ దేశంలో తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా పాకిస్థాన్ స్పందిస్తున్న తీరును గిలానీ ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్కు వివరించనున్నారు.
ఈజిప్టులో జరుగుతున్న 15వ అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సులో భాగంగా ఇరుదేశాల ప్రధానమంత్రులు కలుసుకున్నారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడులు జరిగిన తరువాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు పాకిస్థాన్లోని తీవ్రవాద శక్తులే కారణమని భారత్ నిర్ధారణకు వచ్చింది.
ఈ తీవ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని, దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని భారత్ ప్రపంచ దేశాల సాయంతో గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెస్తోంది. ముంబయి దాడుల తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న రెండో అత్యున్నత స్థాయి సమావేశం ఇదే. ఇటీవల రష్యాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని మన్మోహన్ సింగ్ కలుసుకున్నారు.
ఆనాటి సమావేశంలోనూ ముంబయి ఉగ్రవాద దాడుల దర్యాప్తు, తీవ్రవాదం ప్రధానాంశాలయ్యాయి. అనంతరం ఇటలీలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు కలుసుకున్నారు. తాజాగా గిలానీతో మన్మోహన్ సింగ్ సమావేశంలోనూ ముంబయి ఉగ్రవాద దాడులు, తీవ్రవాదమే ప్రధానాంశాలయ్యాయి. ముంబయి దాడుల తరువాత దేశాధినేతల మధ్య రెండుసార్లు చర్చలు జరగ్గా, ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య మాత్రం పలుమార్లు సమావేశాలు జరిగాయి.