ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై తాము చేపట్టిన తాజా ఆపరేషన్‌లో పాకిస్థాన్ తమకు సరిగా సహకరించడం లేదని అమెరికా కమాండర్ ఒకరు పేర్కొన్నారు. తాలిబాన్లపై తాము తాజాగా చేపట్టిన పోరులో పాకిస్థాన్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనిక కమాండర్‌గా పనిచేస్తున్న జనరల్ స్టాన్లీ మెక్‌క్రిస్టల్ తెలిపారు.
ఈ కారణంగా తాజా సైనిక ఆపరేషన్‌లలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెక్‌క్రిస్టల్ ఈ విషయమే గత వారంతంలో రహస్యంగా ఇస్లామాబాద్ వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీలతో మెక్‌క్రిస్టల్ ఈ రహస్య పర్యటనలో భేటీ అయినట్లు సమాచారం.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై ఇటీవల కాలంలో ముమ్మరం చేసిన సైనిక చర్యలపై మెక్‌క్రిస్టల్ ఈ పర్యటనలో చర్చలు జరిపారు. మెక్‌క్రిస్టల్‌తోపాటు ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దౌత్యాధికారి లెప్టినెంట్ జనరల్ కార్ల్ ఎకెన్‌బెర్రీ కూడా పాక్ పర్యనటకు వెళ్లినట్లు తెలిసింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తాలిబాన్లపై జరుపుతున్న పోరులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ పర్యటనలో అమెరికా అధికారులు పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.