తమ దేశంలోని బలూచిస్థాన్ ప్రాంతంలో అశాంతి నెలకొనడంలో భారత్ పాత్ర ఉందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను తాము ఇప్పటికే భారత్, అమెరికా దేశాలతో పంచుకున్నట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం చెప్పినట్లు ఆ దేశ మీడియా ఇటీవల సంచలనాత్మక కథనాలు వెల్లడించింది.
ఇదిలా ఉంటే బలూచిస్థాన్‌లో భారత్ పాత్ర నిరూపించే ఆధారాలనేవీ పాకిస్థాన్ ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హోల్‌బ్రూక్ స్పష్టం చేశారు. హోల్‌బ్రూక్ గురువారం మాట్లాడుతూ.. బలూచిస్థాన్ ప్రాంతంలో భారత ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలను నిరూపించే విశ్వసనీయ ఆధారాలేవీ తమకు అందలేదన్నారు.
ఇటీవల పాకిస్థాన్ నేతలతో తన సమావేశం సందర్భంగా బలూచిస్థాన్‌లో భారత పాత్ర ఉందనే ఆరోపణలు కూడా చర్చకు వచ్చాయని హోల్‌బ్రూక్ తెలిపారు. ఈ అంశం చర్చల్లో ఉందని, అయితే దీనికి సంబంధించి పాకిస్థాన్ ఎటువంటి ఆధారాలు అందజేయలేదని హోల్‌బ్రూక్ తెలిపారు. దీనిని వివరంగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.