మైఖేల్ జాక్సన్ భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు శుక్రవారం ఈ పాప్ కింగ్‌ది సహజ మరణమేనని పేర్కొన్నారు. ఆయన మరణం వెనుక మందులతో కుట్ర జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. వైద్యులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇప్పటివరకు తాము జరిపిన పరిశీలనలో జాక్సన్ మరణం అసహజమనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు.
మైఖేల్ జాక్సన్ గురువారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మరణానికి కొన్ని గంటల ముందు మాదకద్రవ్య పెయిన్‌కిల్లర్స్‌ను మైఖేల్ జాక్సన్ శరీరంలోకి చొప్పించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గుండెపోటు వార్త తెలుసుకొని వైద్య సిబ్బంది మైఖేల్ జాక్సన్ నివాసానికి వెళ్లే సమయానికే ఆయన శ్వాస తీసుకోవడం లేదు.
దీంతో ఆయనను వెంటనే సమీపంలోని యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ జాక్సన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మైఖేల్ మరణానికి స్పష్టమైన కారణాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఇందుకు టాక్సాలజీ వంటి కొన్ని ఇతర పరీక్షలు కొన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ఇప్పటివరకు తాము చేసిన పరీక్షల్లో జాక్సన్ మరణానికి మందుల వాడకం ద్వారా కుట్ర జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్నేళ్లపాటు తన నృత్యం, సంగీతంతో పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.