వాతావరణ మార్పులపై తక్షణ చర్య అవసరం

ప్రపంచంలోని మూడు బిలియన్ల మంది చిన్నారుల ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో పాల్గొన్న 13 ఏళ్ల భారత బాలిక ఇందులో మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని సూచించింది. 100 దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న వారిలో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా ఉన్నారు.

వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేసిన ఈ బాలిక.. మన భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వరాదని తెలిపింది. ప్రస్తుతం వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేందుకు మరింత నిర్మాణాత్మక చర్యలు అవసరాన్ని తానిప్పుడు ప్రశ్నిస్తున్నట్లు.. మన భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నించకుండా చూసుకోవాలని లక్నోకి చెందిన యుగ్రత్న శ్రీవాత్సవ ఈ సదస్సులో సూచించింది.

హిమాలయాలు కరిగిపోతున్నాయి. ధృవాల్లో ఎలుగుబంట్లు చనిపోతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి సురక్షిత త్రాగునీరు అందడం లేదు. భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పలు జంతు, వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. ఫసిఫిక్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఇదేనా మనం మన భవిష్యత్ తరాలకు అందించబోయేది అంటూ శ్రీవాత్సవ ప్రశ్నించింది. లక్నోలోని సెయింట్ ఫిడెలిస్ పాఠశాలలో శ్రీవాత్సవ తొమ్మిదో తరగతి చదువుతుంది.

వెబ్దునియా పై చదవండి