విదేశీ విద్యార్థులపై దాడులు ఎక్కువగా జరుగుతున్న విక్టోరియా రాష్ట్రంలో ఇటువంటి దుశ్చర్యలను అరికట్టేందుకు పోలీసులు ఈసారి సమర్థవంతమైన చర్యలతో రంగంలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం భారతీయులతోపాటు, విదేశీ విద్యార్థులపై దాడులను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కెవిన్ రూడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్టోరియా పోలీసులు విదేశీయుల రక్షణ కోసం మరిన్ని చర్యలు చేపట్టారు.
ఇటువంటి నేరాలను అరికట్టేందుకు రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పటిష్టపరిచినట్లు విక్టోరియా పోలీసులు తెలిపారు. విక్టోరియా రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా భారతీయ విద్యార్థులపై 17 దాడులు జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ విద్యార్థులపై వరుసగా జరుగుతున్న ఈ దాడులు జాత్యహంకారంతో కూడుకున్నవని ఆరోపణలు రావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది.
ఈ దాడులను భారత్‌సహా, వివిధ దేశాల ప్రభుత్వం ఖండించాయి. తమ దేశ విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. తాజాగా విక్టోరియా పోలీసులు "సేఫ్ స్టేషన్ ఆపరేషన్" పేరుతో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులను నివారించేందుకు చర్యలు చేపట్టారు.
మెల్బోర్న్లోని అన్ని రైల్వే స్టేషన్ల వద్ద ఇటువంటి నేరాలు జరగకుండా చూసేందుకు పోలీసులను మోహరించారు. దాడులకు పాల్పడుతున్నవారిని ఉపేక్షించబోమని పోలీసులు ఈ చర్యల ద్వారా గట్టి సందేశం పంపారు. సేఫ్ స్టేషన్ ఆపరేషన్ చేపట్టిన తరువాత విక్టోరియా పోలీసులు కొంత మందిని అరెస్టు చేయడంతోపాటు, కొందరిపై జరిమానా కూడా విధించారు.