అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు మోత - 10 మంది మృత్యువాత

మంగళవారం, 23 మార్చి 2021 (08:39 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు జరిగాయి. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. 
 
ఈ కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
ఇటీవల అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 8 మంది మరణించగా వారిలో ఆరుగురు ఆసియన్‌ అమెరికన్లే కావడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనపై అమెరికాలో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 'బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం 10 మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు' అని తెలిపారు. 
 
దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్‌ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్‌ జేర్డ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యా. కింగ్‌ సూపర్స్‌ వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నేను నిశితంగా గమనిస్తున్నా’ అని జేర్డ్‌ ట్వీట్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు