అరెస్టు అయితే చేశారు కానీ.. తరలించలేక తలప్రాణం తోకకు వచ్చింది..

ఆదివారం, 19 జనవరి 2020 (17:10 IST)
ఇరాన్, ఇరాక్, సిరియా దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికాతో పాటు.. సంకీర్ణ బలగాలు ఉక్కుపాదం మోపాయి. ఫలితంగా ఐసిస్ అగ్రనాయకత్వం పూర్తిగా హతమైంది. ఈ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అదేసమయంలో భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఇరాక్ దేశంలో ఓ ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతడ్ని తరలించడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. అతడి పేరు ముఫ్తీ అబు అబ్దుల్ బారీ. బారీ పేరుకు తగ్గట్టు నిజంగా భారీకాయుడే.
 
అలాంటి ఇలాంటి బాడీ కాదు... 250 కిలోల భారీకాయుడు మరి. చురుగ్గా కదల్లేడు కానీ, పదునైన మాటలతో ఎలాంటి వారినైనా రెచ్చగొట్టి ఉగ్రవాదం దిశగా నడిపించగల వాక్పటిమ ఉన్నవాడు. విద్వేష ప్రసంగాలు చేయడంతో మాస్టర్! ఈ కారణంగానే ఐసిస్ లో అతడికి సముచిత స్థానం కల్పించారు. 
 
ఈ ఉగ్రవాది మోసుల్‌లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు వచ్చారు. అతడ్ని చూసిన తర్వాత ఎక్కడికీ పారిపోలేడని పోలీసులకు అర్థమైంది. కారణం అతడి ఊబకాయమే.
 
అరెస్టు అయితే, చేశారుకానీ, అతడిని తమ కారులో ఎక్కించడం ఎలాగో పోలీసులకు తెలియలేదు. అన్నిరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కారులో ఎక్కించే ఆలోచన విరమించుకుని, ఓ పికప్ ట్రక్ తెప్పించారు. ఓ పెద్ద బస్తాను ఎత్తి కుదేసినట్టు ఆ ట్రక్కులో పడేసి తీసుకెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు