1000 లైక్స్ రాకపోతే పిల్లాడిని కిందపడేస్తా... ఫేస్‌బుక్ పైత్యం...

బుధవారం, 21 జూన్ 2017 (16:17 IST)
సెల్ఫీ తీసుకో.. అప్‌లోడ్ చేసుకో.. అరె చెక్ చేయరా.. ఎన్ని లైకులు వచ్చాయో.. చిన్నాపెద్దా.. వారం వర్జ్యం.. మంచీ చెడు.. ఇవేవీ అక్కర్లేదు. కాదేదీ సెల్ఫీకి అనర్హం అంటూ చావుల్లోనూ, తద్దినాల్లో సెల్ఫీ మోజులో పరువు పోగొట్టుకోవడమే కాక, పరుగులెత్తే రైళ్ల ముందు, కరెంటు వైర్ల ముందు నయా నయగారాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవాళ్లు కోకొల్లలు. 
 
ఇప్పుడిక ఈ లైకుల పిచ్చికి పరాకాష్టగా అల్జీరియాలోని ఓ తండ్రి చేసిన పని రికార్డు స్థాయిలో మార్మోగుతోంది. 15వ అంతస్తు కిటికీలో నుండి తన కొడుకుని పడేయబోతున్నట్లు ఫోటోని తీసి, దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి, 1000 లైక్స్ రాకపోతే పిల్లాడిని కిందపడేస్తానంటూ క్యాప్షన్‌ను పెట్టాడు. 
 
లైక్‌ల సంగతేమో కానీ, సోషల్ మీడియా యూజర్లు అతనిపై ఓ రేంజిలో ధ్వజమెత్తడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కోర్ట్ అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

వెబ్దునియా పై చదవండి