భారతరత్న అబ్దుల్ కలాం గౌరవార్థం స్విట్జర్లాండ్ 'జాతీయ సైన్స్ దినోత్సవం'

శుక్రవారం, 26 మే 2017 (18:01 IST)
భారతరత్న అబ్దుల్ కలాం 2002-2007 మధ్య రాష్ట్రపతి పదవి చేపట్టి ప్రజల రాష్ట్రపతిగా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందే భారతరత్న అవార్డు పొందిన మూడో వ్యక్తి (సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు) కలాం.
 
ప్రపంచంలోని దాదాపు 40 ప్రఖ్యాత వర్శిటీల నుండి అబ్దుల్ కలాం గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. విద్యార్థులకు అద్భుతమైన ప్రేరణను అందించినందుకు ఐక్యరాజ్యసమితి అబ్దూల్ కలాం జన్మదినాన్ని (అక్టోబర్ 15) వరల్డ్ స్టూడెంట్స్ డేగా ప్రకటించింది.
 
ఇది మాత్రమే కాకుండా ఆయనపై ఉన్న అమితమైన గౌరవంతో మరొక దేశం కూడా కలాం గౌరవార్థం ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశమే స్విట్జర్లాండ్.
 
నేడు స్విట్జర్లాండ్ "జాతీయ సైన్స్ దినోత్సవం". 2005వ సంవత్సరం మే 26వ తేదీన అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో స్విట్జర్లాండ్‌ను సందర్శించారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి కలాం పట్ల ఉన్న అపార గౌరవంతో ఆయన తమ దేశాన్ని మొదటిసారి సందర్శించిన మే 26వ తేదీనే తమ జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా కలాంను స్ఫూర్తిగా తీసుకోవడం నిజంగా భారతదేశానికే గర్వకారణం.

వెబ్దునియా పై చదవండి