పొరుగు దేశాలను తాకిన ఉల్లిఘాటు... కిలో రూ.220

సోమవారం, 18 నవంబరు 2019 (11:52 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల రేటు ఆకాశానికి తాకింది. ఈ ఘాటు పొరుగు దేశాలను కూడా తాకింది. ఫలితంగా ఆ పొరుగు దేశాల్లో కిలో ఉల్లిపాయల రేటు వందల రూపాయలకు పెరిగిపోయింది. 
 
దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లిపాయల రేటు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. విదేశాల నుంచి లక్షల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ధర మాత్రం ఏమాత్రం దిగిరావడం లేదు. ఫలితంగా దేశంలోనే కిలో ఉల్లిపాయల ధర రూ.75 నుంచి రూ.100 పలుకుతోంది. 
 
ఇకపోతే, భారత్‌ ఎగుమతులపై ఆధారపడిన బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వీటి రేటు వందల రూపాయలకు చేరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
 
పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన ఇంట్లో కూరల్లో ఉల్లిని వాడద్దంటూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు