బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు కేసులు.. ఇక ప్రవాస జీవితమేనా?

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (11:34 IST)
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె తిరిగి ఢాకాకు వెళ్లే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెపై నాలుగు కేసులు నమోదు కావడంతో ఆమె ఇకపై ప్రవాస జీవితమే గడపాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. 
 
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పోరాటం కారణంగా ఆమె తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం హసీనా దేశం విడిచిపెట్టినప్పటీ నుంచి ఆమెపై వరుస కేసులు బనాయిస్తోంది. ఇప్పటివరకు ఆమెపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. వీటిలో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం, కిడ్నాప్ కేసులు ఉన్నాయి.
 
2010లో అప్పటి బంగ్లా రైఫిల్స్ (బీడీఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై మాజీ ప్రధానితో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్‌తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. రహీమ్ కుమారుడు న్యాయవాది అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు ఈ మర్డర్ కేసు దాఖలు చేశారు.
 
అలాగే జులై 18న చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మిలిటరీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హసీనాతో పాటు మరో 48 మందిపై హత్య కేసు నమోదైంది. ట్రేడింగ్ కార్పొరేషన్ వ్యక్తి హత్యపై హసీనాతో పాటు 27 మందిపై కేసు నమోదు కాగా.. ఆటో రిక్షా డ్రైవర్ మరణం కేసుల్లో మాజీ ప్రధానితో పాటు 25 మందిపై హత్య కేసు నమోదైంది. ఇలా ఇప్పటివరకు షేక్ హసీనాపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు