భారత్, చైనా, భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌లో చైనా నిబంధనలకు విరుద్ధంగా భారత భూభాగంలోకి ప్రవేశించి రోడ్డును నిర్మిస్తోంది. దీన్ని భారత్, భూటాన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదేసమయంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో చైనా కూడా భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. దీంతో సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో చైనా మీడియా మరోసారి నోటి దురుసును ప్రదర్శించింది. సిక్కిం సరిహద్దులో భారత బలగాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని ఆరోపిస్తూ, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసేందుకైనా వెనుకాడబోమని ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దు (ఎల్‌ఏసీ) వెంట అనేక చోట్ల భారత్ నిబంధనలు ఉల్లంఘించి సమస్యలు సృష్టిస్తున్నదని ఆరోపించింది.
భారత సైన్యంతో తాము ఘర్షణపూరిత వాతావరణాన్ని కోరుకోవడం లేదని, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాసంలో పేర్కొన్నది. మరోవైపు సరిహద్దు సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని చైనా విదేశాంగశాఖ భారత ప్రభుత్వానికి సూచించింది.