బెంగాల్, అస్సాం రోడ్ లింక్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో వివాదాస్పద ప్రాంతంలో చైనా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు ఈ రోడ్డుకు సమీపంలోనే జాల్ధాకా నదిపై ఓ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఉంది. భూటాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాజెక్టే.. సిక్కింలోకి ప్రవేశించడానికి బ్రిడ్జ్‌లాగా వాడుతున్నారు.
ఒకవేళ చైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఈ బ్రిడ్జ్ ద్వారా వాళ్ల బలగాలు ఏకంగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే గత మూడు వారాలుగా భారత బలగాలు అక్కడే తిష్ట వేసి.. రోడ్డు నిర్మాణ పనులు సాగకుండా అడ్డుకుంటున్నాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కావడంతో అస్సలు వెనక్కి తగ్గకూడదని భారత్ భావిస్తున్నది. మరోవైపు భూటాన్ కూడా ఈ రోడ్డు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.