ఇలా అయితే ఎలా? యాప్‌లపై భారత్ నిషేధం సరికాదు : చైనా

గురువారం, 3 సెప్టెంబరు 2020 (16:45 IST)
దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించాయని పేర్కొంటూ ఆన్‍లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు 118 యాప్‌లపై కేంద్రం బుధవారం నిషేధం విధించింది. ఇవన్నీ చైనాకు చెందిన యాప్‌లే కావడం గమనార్హం. గతంలో నిషేధం విధించిన యాప్‌లతో కలుపుకుంటే భారత్ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 177కి పైగా చేరింది. భారత్ చర్యపై చైనా స్పందించింది. 
 
ఇదే అంశంపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ మాట్లాడుతూ దేశం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంగించిందని ఆరోపించారు. చైనా యాప్‌లపై బ్యాన్‌ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ నిర్ణయం విచారకమని, మరోసారి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. 
 
కాగా, భారత సైబర్‌ స్పేస్‌ భద్రతే లక్ష్యంగా పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం విషయం తెలిసిందే. పలు యాప్‌లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్‌కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ‘హానికర యాప్‌’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
అలాగే జూన్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై బ్యాన్‌ విధించింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ మరోసారి గట్టి ఝలక్‌ ఇచ్చింది. పబ్‌జీతోపాటు ఆ దేశానికి చెందిన 118 యాప్‌లపై నిషేధం విధించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
భారత్‌లో దాదాపు 3.3 కోట్ల మంది క్రియాశీలక పబ్‌జీ యూజర్లు ఉన్నట్లు అంచనా. నిషేధానికి గురైన వాటిలో పబ్‌జీతోపాటు పబ్‌జీలైట్‌, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, వియ్‌చాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీయూన్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు