క్యుపర్టినో పట్టణ తొలి మహిళా మేయర్‌గా భారత సంతతి మహిళ

శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:51 IST)
అమెరికాలో మరో భారత సంతతి మహిళ విజయకేతనం ఎగురవేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న క్యుపర్టినో పట్టణ మేయర్‌గా సవితా వైద్యనాథన్‌ ఎంపికయ్యారు. ఒక భారత సంతతి మహిళ ఈ పట్టణానికి మేయర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ ఈ పట్టణ మేయర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో అద్భుతమైన క్షణాలు ఇవేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిన చిన్నపట్టణాల్లో క్యుపర్టినో ప్రముఖమైనది. యాపిల్‌ సంస్థ ప్రధాన కార్యాలయం క్యుపర్టినోలో ఉండటంతో ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. 
 
కాగా, సవితా వైద్యనాథన్ గత 19 యేళ్లుగా క్యుపర్టినోలో నివసిస్తున్నారు. ఈమె అక్కడి పలు కమ్యూనిటీలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన సేవలు అందిస్తున్నారు. ఎంబీఏ చదివిన ఆమె హైస్కూల్‌ మ్యాథ్స్‌ టీచరుగా, కమర్షియల్‌ బ్యాంకులో అధికారిగా పనిచేశారు. 

వెబ్దునియా పై చదవండి