అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ భారత్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం క్యాపిటల్ రోటుండాలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులతో పాటు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. క్యాపిటల్ రోటుండాలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
యూఎస్ క్యాపిటల్ రోటుండాలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గంటలు) ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం ట్రంప్ అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు.
ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే కుటుంబ సమేతంగా ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. అక్కడ దాదాపు 100 మంది ప్రముఖులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు అమెరికా రాజధాని నగరానికి చేరుకోవడం గమనార్హం.
పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, ప్రపంచ కుబేరులతో పాటు అతిరథ మహారథుల సమక్షంలో ట్రంప్ ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది.
అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రముఖులు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలు, ఈ ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి కమలా హ్యారిస్ సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, చైనా ఉపాధ్యక్షుడు హన్ ఝెంగ్, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరు కానున్నారు. వీరితో పాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, టెక్ దిగ్గజ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిక్‌టాక్ సీఈవో షోజీ చ్యూ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్లో అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా అమెరికా స్టార్ సింగర్ క్యారీ అండర్ వుడ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇతర లెజెండరీ కళాకారులు సైతం తమ ప్రదర్శనలతో అతిథులను అలరించనున్నారు.
విపరీతమైన చలి కారణంగా ఈ వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహిస్తున్నారు.
రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తనదైన ముద్ర వేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు తొలిరోజే సుమారు 100కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.