అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ మరోమారు విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలోనే అత్యంత బాధ్యతారాహిత్య ప్రెసిడెంట్ ట్రంప్ అని వ్యాఖ్యానించారు. ఆయన వల్లే దేశంలో కరోనా వైరస్ తారాస్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా అనేక మంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, అధికార బదలాయింపులో జాప్యంతో కొవిడ్-19 టీకా ప్రణాళిక వారాలు లేదంటే నెలలు వెనక్కి వెళ్తోందని ఆయన హెచ్చరించారు. హెల్త్‌కేర్ కార్మికులతో వర్చువల్ రౌండ్‌టేబుల్‌లో బుధవారం మాట్లాడారు. ట్రంప్ పరిపాలన బృందం నుంచి తమకుఎలాంటి సహకారం అందడం లేదని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఎన్నికను ట్రంప్ అంగీకరించడం లేదు. అనేక రాష్ట్రాల్లో పోల్ ఫలితాలను సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
'తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అడ్మినిస్ట్రేషన్‌ను గుర్తించడంలో వైఫల్యం. జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు విజేత ఎవరో చట్టం చెబుతుందని, అప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి' అని బైడెన్ అన్నారు. తమకు ఇంకా సమాచారం తెలియదని, కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు పంపిణీకి సిద్ధమవుతాయో?, ఎవరికి మొదట ఇవ్వాలి.. ప్రణాళిక ఏంటీ అనేదిపై అవగాహనకు వస్తామన్నారు.
అంతకుముందు ఫిబ్రవరి నుంచి కోవిడ్ ఆసుపత్రిలోని ఐసీయూలో సేవలందిస్తోన్న నేషనల్ నర్సెస్ యునైటెడ్, మిన్నెసోటా చాప్టర్ అధ్యక్షురాలు మేరీ టర్నర్ తన అనుభవాలను వివరిస్తూ కంటతడి పెట్టారు. సరైన రక్షణ సదుపాయాలు లేకపోవడం వలన తమ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు ఎన్-95 మాస్కులను తిరిగి తిరిగి ఉపయోగించాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు.
సౌకర్యాల లేమి కారణంగా ఆరోగ్య కార్యకర్తలకు గత యేడాది కాలంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించలేదని ఆమె వెల్లడించారు. భావోద్వేగంతో మాట్లాడుతోన్న టర్నర్ అనుభవాలను విన్నతర్వాత, అందుకు సమాధానంగా బైడెన్ మాట్లాడుతున్నప్పుడు జో బైడెన్ కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది.