వాషింగ్టన్‌కు ట్రంప్ వీడ్కోలు.. బైడెన్‌కు సహకరించాలని వినతి

బుధవారం, 20 జనవరి 2021 (10:47 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శ్వేతసౌధంను వీడారు. ఆయన తన అధ్యక్ష పీఠాన్ని త్యజించారు. అయితే, ఉద్వేగం తట్టుకోలేక, కుర్చీని వదిలిపెట్టలేకు కన్నీటిపర్యంతమయ్యారు. అలా బుధవారం వాషింగ్టన్ నగరానికి ఆయన వీడ్కోలు పలికారు. గత యేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. కానీ, ఆయన ఓటమిని జీర్ణించుకోలేక పోయారు. ఈ ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే, న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలతో పాటు సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఆయన దిగిరాకతప్పలేదు. ఫలితంగా వాషింగ్టన్ నగరాన్ని వీడిపోయారు. 
 
కాగా, ట్రంప్ పాలనా హయాంలో ఎన్నో సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువయ్యారు. తన ట్రంప్ తన తెంపరితనంతో చివరకు రెండు సార్లు అభిశంసనం ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా అప్రదిష్టను సైతం మూటగట్టుకున్నారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. శ్వేతసౌధం నుంచి వెళ్లే వరకు కూడా తన పరాజయాన్ని అంగీకరించలేదు. బుధవారం ఉదయం అధ్యక్ష హోదాలోనే ఆయన వాషింగ్టన్‌ను వీడారు. 
 
వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లే ముందు... జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వీడ్కోలు స్పీచ్ ఇచ్చారు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తున్ననన్న ట్రంప్.. తన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైందన్నారు. కేపిటల్ భవనంపై దాడిని ఖండించిన ఆయన.. రాజకీయ అల్లర్లు అగ్రరాజ్యానికే అవమానం అన్నారు. 
 
ఈ సందర్భంగా ట్రంప్ తొలిసారి బైడెన్‌కు సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. అమెరికన్లందరూ బైడెన్ బృందానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ప్రభుత్వానికి సహకరించాలన్నారు. బైడెన్ పాలన సక్సెస్ కావాలంటూ ప్రార్థించాలని తెలిపారు. ఇక వారం రోజులుగా బయటకు రాని ట్రంప్.. చివరకు వైట్‌హౌస్‌ను వదిలేముందు మీడియాకు కనిపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు