అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు... లైట్‌గా తీసుకున్న ట్రంప్?!

బుధవారం, 8 జనవరి 2020 (12:10 IST)
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిదాడులతో విరుచుకుపడింది. ఈ దాడులపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. ఇరాక్‌లో ఉన్న తన బలగాలను తక్షణమే అమెరికా వెనక్కు తీసుకోవాలని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. లేనిపక్షంలో మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 
 
మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమీక్షిస్తున్నారని వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఇరాన్‌ డజనుకు పైగా క్షిపణులను ప్రయోగించినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ కూడా ధృవీకరించింది.
 
అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలు అల్‌ అసాద్‌, ఇర్బిల్‌పై దాడి జరిగినట్లు గుర్తించారు. భారీ నష్టం జరిగినట్లు పెంటగాన్‌ వర్గాలు అంచనా వేస్తోంది. ఇరాన్‌ అగ్రశ్రేణి సైనిక జనరల్‌ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైట్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, సింపుల్‌గా... 'ఆల్ ఈజ్ వెల్' అంటూ ట్వీట్ చేశారు.
 
ఇరాక్‌లోని తమ రెండు మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ట్రంప్ తెలిపారు. ప్రాణనష్టంతో పాటు, స్థావరాలకు జరిగిన డ్యామేజీలపై సమీక్ష జరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా తమకు అత్యంత శక్తిమంతమైన, అత్యాధునిక మిలిటరీ వ్యవస్థ ఉందని చెప్పారు. రేపు ఉదయం పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తానని తెలిపారు.
 
మరోవైపు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ... రానున్న రోజుల్లో ఇరాన్ పై తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులను అమెరికా చేయవచ్చని, విరుచుకుపడే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు