గత కొంతకాలంగా నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడి చేసి హత్య చేయడమో లేక కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారిపోయింది. అలాగే, రైతులు పంటలు పండించుకోవాలన్నా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా సాయుధ దండగులు మరోమారు పెట్రేగిపోయారు. ఏకంగా 12 మందిని కాల్చిచంపి మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దారుణం నైజీరియా అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన దండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు.