ప్రాణాలు పోతున్నాయని తెలియరాగానే తమ ఆశలు నెరవేర్చాలని కోరుతారు. ఈ క్రమంలో కొందరు పేషెంట్స్ తమ అభిమాన నటుల్ని చూసేందుకు ఇష్టపడతారు. అయితే ఈ మహిళ మాత్రం తాను అల్లారుముద్దుగా పెంచుకున్న శునకాన్ని చూడాలనుకుంది. ఆమె కోరిక మేరకు ఆ శునకాన్ని చూపించిన వైద్యులు.. పెంపుడు కుక్కతో ఆమె కోసం ఎలా తపించిందో చూసి కంటతడి పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన రీబాన్ చిలీ(49) టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో క్రమంగా మరణానికి చేరువైంది. చనిపోయే ముందు తాను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకాన్ని చూడాలని ఉందంటూ తన చివరి కోరికను వైద్యుల ముందు ఉంచింది. స్పందించిన వైద్యులు ఆమె ఇంటి నుంచి శునకాన్ని తెప్పించారు. అంతే యజమానురాలిని చూసిన ఆ కుక్క తోక ఊపుతూ.. ఆమె ఒళ్లంతా తడిమింది. ఆమెతో తన మాట్లాడట్లేదని ఆమె ముఖానికి ఉంచిన మాస్క్‌ను కూడా తీయబోయింది. ఆపై తన ఓనర్ పరిస్థితి తెలుసుకుని మౌనంగా ఉండిపోయింది.
ఆప్యాయంగా స్పృశిస్తున్న యజమానురాలి చేతిల్లోకి ఒదిగిపోయింది. ఇక పెంపుడు శునకాన్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్టు రీబాన్ ఒక్కసారిగా దానిని పొదివి పట్టుకుంది. కాసేపు ఒళ్లంతా తడిమింది. దూరం నుంచి నిలబడి ఈ తతంగాన్ని చూస్తుండిపోయిన వైద్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు షేర్లు వెల్లువెత్తుతున్నాయి.