ప్రవాసీయులకు కొత్త మార్గదర్శకాలు : కరోనా లక్షణాలు లేకుంటే...

సోమవారం, 3 ఆగస్టు 2020 (08:44 IST)
విదేశాల్లో ఉండే భారతీయులకు కోసం కేంద్ర ఆరోగ్య శాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే ప్రవాసీయులకు కరోనా లక్షణాలు లేకుంటే ఎలాంటి క్వారంటైన్ అక్కర్లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఈ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇవి ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం... 
* విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in అనే వెబ్‌సైట్‌లో 7 రోజుల పాటు పెయిడ్‌ ఇన్సిట్యూషనల్‌ క్వారంటైన్‌లో, 7 రోజులు హోం క్వారంటైన్‌లోఉంటామని అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 
 
* కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్‌ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆర్టీ - పీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్‌ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్‌ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి.
* ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను తమ మొబైల్ ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకునితీరాలి. 
 
* ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు.
* భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 
* ప్రయాణంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సివుంటుంది. 
* ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్‌/షిప్‌ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్‌ స్పెషల్‌ హెల్త్‌ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు